
వెంకటేష్ మహా ఒక ప్రముఖ భారతీయ దర్శకుడు. ఆయన ఒక దర్శకుడిగా మాత్రమే కాకుండా, రచయిత మరియు నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘మహా’ సొంతూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, అతను సినీ పరిశ్రమలో సెట్ హెల్పర్ స్థాయి నుండి దశల వారీగా వివిధ స్థాయిల్లో పనిచేస్తూ "C/O కంచరపాలెం " వంటి విశేష ఆదరణ పొందిన చిత్రాన్ని రచించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విమర్శకుల మెప్పును పొందడమే కాక, IMDB Top Telugu చిత్రాల్లో మొదటి స్థానంతో పాటు, భారతీయ చిత్రాల్లో 16వ స్థానం లో నిలిచింది. అలాగే, ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు తో పాటు ఆరు విభాగాల్లో నామినేట్ అయ్యింది. C/O కంచరపాలెం, 2019 ఉత్తమ తెలుగు చిత్ర విభాగంలో ప్రతిష్టాత్మక ఫిలింఫేర్ క్రిటిక్స్ చాయిస్ అవార్డును సొంతం చేసుకుంది.

‘మహా’ రెండవ చిత్రం "ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య". 2020 లో NETFLIX లో విడుదల అయిన ఈ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రం, స్క్రీన్ ప్లే అవార్డు లభించాయి. ఈ చిత్రం మళయాళ "మహేషింటే ప్రతీకారం" కి అనుకరణ. ఆ చిత్రం మూల కథ తీసుకుని మహా రచన, దర్శకత్వం వహించారు. "ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య" ఒక నిజాయితీగల అనుకరణ చిత్రంగా విమర్శకుల, ప్రేక్షకుల ఆదరణ పొంది ఫిలిం కంపానియాన్ వారి "FC Gold " పురస్కారాన్ని అందుకుంది. దానితో పాటు SIIMA అవార్డ్స్ లో అయిదు విభాగాల్లో నామినేట్ అయింది.
తన మూడవ ప్రాజెక్ట్ గా ‘మహా’ AMAZON PRIME వారి ప్రముఖ Anthology అయిన "మోడ్రన్ లవ్ - హైద్రాబాద్" లోని "FINDING YOUR PENGUIN" అనే episode కి దర్శకత్వం వహించారు. ఈ episode లో ఒక యువతి డేటింగ్ ప్రపంచాన్ని చూపెట్టిన విధానం ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా విమర్శకులచే ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత, ‘మహా’ నటన, రచనలతో పాటు, నిర్మాతగా మారి ఒక చిత్రం నిర్మించారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
తన రచనల ద్వారా మానవ సంబంధాలకు ఒక కొత్త ఊపిరి పోసి, వాటి ద్వారా లోతైన భావాల్ని ప్రేక్షకులకి అందించడమే మహా ప్రత్యేకత. తన చిత్రంలోని పాత్రల ద్వారా అద్భుతమైన కథను సాధారణ జీవితాల్లో సరళంగా జొప్పించి, పాత్రలకు సజీవ రూపకల్పన చేసి కలకాలం గుర్తుండిపోయేలా చేయడం మహా ప్రత్యేకత.
ప్రస్తుతం ఇండియా లో ప్రతిభావంతులైన యువ దర్శకుల జాబితాలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈయన, ఇప్పుడు తన అత్యుత్తమ కథ అయిన "మర్మాణువు" తో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్ర కథలో ఆద్యంతం ఆసక్తి రేకెత్తించే మ్యాజికల్ రియలిజం, సైకలాజికల్ థ్రిల్లర్ మరియు డార్క్ కామెడీ అంశాలతో పాటు, ముఖ్యంగా ఇది ఒక కుటుంబ కథా చిత్రం. మీకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతున్న ఈ "మర్మాణువు" ని, పూర్తిగా ఆస్వాదించడానికి వెండితెర మాత్రమే ఏకైక సాధనం!